Wednesday, January 30, 2013

తెలుగుకు వెలుగు


తెలుగుకు వెలుగు

(ఈరోజు ఆంద్ర జ్యోతి సంపాదకీయం) 

కొద్దిగా ఆలస్యమే అయినా, రాష్ట్ర పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముదావహమే. పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్‌లో, డిగ్రీ కళాశాలల్లో తెలుగు పేపర్‌ను నిర్బంధం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక తెలుగు భాషేతరులు కూడా తెలుగును రెండవ లేక మూడవ భాషగా అభ్యసించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, బీటెక్ వంటి డిగ్రీలను అందించే సంస్థలతో సహా ఇంటర్మీడియట్ కళాశాలలన్నిటిలో మూడవ భాషగా తెలుగు తీసుకోవడం అనివార్యమవుతుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సెకండరీ, ఉన్నత విద్యాశాఖాధికారులు నిర్దిష్ట నిబంధనలను రూపొందించడంలో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, కళాశాలల్లో తెలుగును నేర్చుకోవడం తప్పనిసరి కాదు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇప్పటి వరకూ తెలుగుకు బదులుగా స్పెషల్ ఇంగ్లీషును తీసుకునేందుకు వీలుండేది. కానీ, తాజా ప్రతిపాదనతో వారు తప్పనిసరిగా తెలుగును నేర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని పాఠశాలలన్నిటిలోనూ తెలుగు, ఇంగ్లీషు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ నిబంధనల్లో సవరణలు తీసుకు రావడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. ఒకటి నుంచి పదవ తరగతి చదువుతున్న సుమారు 1.29 కోట్ల మంది విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ స్కూళ్లన్నిటికీ ప్రభుత్వ ఉత్తర్వులు వర్తిస్తాయి. తెలుగును నేర్చుకోని పక్షంలో మార్కులు, ర్యాంకుల్లో కోత ఖాయం.

ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌తో సహా పలువురు పాఠశాల స్థాయిలో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను చేశారు. ఈ మేరకు చేసిన ఓ తీర్మానం సభ ఆమోదం పొందింది కూడా. ఆ తరువాత కూడా అధికార భాషా సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రతిపాదన చేశారు. ముఖ్యమంత్రి అందుకు వెంటనే అంగీకరించారు. తెలుగును మృత భాషల జాబితాలో చేర్చాల్సిన ప్రమాదం ముంచుకొస్తోందంటూ కొన్నేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. తెలుగును మాట్లాడే యువతీ యువకులు, విద్యార్థుల సంఖ్య 27 శాతానికంటే తక్కువగా ఉన్న పక్షంలో ఈ భాష మృత భాషగా మారడానికి ఎంతో కాలం పట్టదని కూడా తెలిపింది. ఇక రాష్ట్రంలో 40 ఏళ్ల లోపువారిలో అధిక శాతం మంది తెలుగు మాట్లాడడానికి బిడియపడుతున్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సహజంగానే ఈ ధోరణి రాష్ట్రంలోని విద్యావేత్తలు, భాషాభిమానుల్లో ఆందోళన కలిగించింది.

వాస్తవానికి 2003 జూలైలో చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదవ తరగతి వరకూ తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాషకు పూర్వ వైభవం కల్పించడం, రాష్ట్రంలో దీనికి మొదటి అధికార భాషగా గుర్తింపు లభించేలా చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని అప్పటి విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వర రావు ప్రకటించారు. త్రిభాషా సూత్రం కింద ఉర్దూ మీడియం స్కూళ్లల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయడం జరుగుతుందని అప్పట్లో ఆయన తెలిపారు. అయితే, ఆ ఉత్తర్వులు ఆచరణకు నోచుకోలేదు.

ఈ నేపథ్యంలో తెలుగును విద్యాసంస్థల్లో తప్పనిసరి చేయడం హర్షణీయమైన పరిణామమే కానీ, ఇందులో కొన్ని సమస్యలు కూడా ఇమిడి ఉన్నట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉన్న పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయడం వల్ల ఇతర రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులకు స్థానికంగా ఇబ్బందులు రావచ్చు. సరిహద్దు రాష్ట్రాలు ఇటువంటి నిర్ణయం పట్ల ఏవిధంగా స్పందిస్తాయన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిర్ణయం ఎంత వరకూ అమలు జరుగుతుందన్నది కూడా సందేహమే. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల మీద ప్రభుత్వానికి అదుపూ అజమాయిషీ లేదనేది నగ్నసత్యం. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా 'మా తెలుగు తల్లికీ మల్లెపూదండ...' అనే గీతాన్ని ఉదయం వేళ రాష్ట్ర గీతంగా గానం చేయాలనే ప్రభుత్వ నిబంధన ప్రైవేట్ పాఠశాలల్లో అమలు జరగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. పాఠ ్య ప్రణాళిక దగ్గర నుంచి సెలవుల వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు సొంత నిర్ణయాలనే అమలు చేస్తుంటాయి. రాష్ట్రంలో 70 శాతానికి పైగా పాఠశాలలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఎంత వరకూ అమలు జరుగుతాయన్నది కూడా సందేహాస్పదమే.

అంతేకాక, కేంద్రీయ విద్యాలయాలు, సి.బి.ఎస్.ఇ, ఐ.సి.ఎస్.ఇ విద్యాసంస్థలలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే వర్తిస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. సెంట్రల్ బోర్డు కింద పనిచేసే పాఠశాలలు రాష్ట్రంలో 3,000 పైచిలుకే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి కాదు. ఇక్కడ ఏ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని పాఠశాలల్లో తెలుగు భాషా బోధన లేదు కూడా. కొన్ని సమస్యలున్నప్పటికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతుల పునరుజ్జీవనానికి తెలుగు బోధనను తప్పనిసరి చేయడం, ఇళ్లల్లో తెలుగు మాట్లాడడం తప్ప గత్యంతరం లేదు. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఉత్తర్వులను అమలు చేయడం అవసరం.

Saturday, January 26, 2013

పద్మశ్రీ బాపు : కొసమెరుపు



అచ్చ తెలుగు బొమ్మకి, అక్షరాలకి, సినిమాలకి చిరునామా - మన బాపు ఇన్నాళ్ళకు "పద్మశ్రీ" సంపాదించారు. ఆయన ప్రతిభ కొంచెం (అంటే చాలా) ఆలశ్యంగా అయినా గుర్తింపు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది. 



ఈ సందర్భంగా ఆయన విజయంలో సమాన పాత్రధారి (సినిమాలకు సంబందించినంత వరకూ)
శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారిని కూడా స్మరించుకుందాం. 


వీళ్ళిద్దరూ మన తెలుగు భాషకు కొత్త జవం జీవం ఇవ్వడంలో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్ని సినిమాలు, ఎన్ని మాటలు - బుద్ధిమంతుడు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సంపూర్ణ రామాయణం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం లాంటి సినిమాలతో తెలుగు భాషకి కొత్త జీవితం ప్రసాదించిన బాపు రమణ ద్వయానికి తెలుగు జాతి ఎప్పుడు ఋణపడి ఉంటుంది. 

బాపు తన గీతలో తెలుగుదనానికి ఒక రూపు కల్పించారు. ఆయన బొమ్మలతో ఎన్ని పుస్తకాలు, నవలలు, కావ్యాలు తమ విలువను పెంచుకున్నాయి !! 

ఆయన కార్టూన్లు..కడుపుబ్బా నవ్విస్తాయి. ఆయన సృష్టించిన పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. 

కొసమెరుపు: 

ఇంతకీ బాపు పేరు ను ప్రతిపాదించినది "ఆంద్ర ప్రదేశ్" జాబితా నుంచి కాదట. ఆయన పేరు (శ్రీమతి జానకి పేరు కూడా) తమిళనాడు ప్రభుత్వ జాబితా నుంచి ఎంపికయింది!! 

పద్మ అవార్డుల పూర్తి జాబితా చూడండి.

బాపు పేరు కనపడలేదా? పద్మశ్రీ లలో  తొమ్మిదవ పేరు చూడండి !! 






ఇప్పుడు నిబిడాశ్చర్యంతో అందరూ....

Friday, January 25, 2013

ప్రియ భారత జనయిత్రి



ప్రియ భారత జనయిత్రి 



రచన: శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ ధివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ సశ్యామల

సుశ్యామ చలచ్చేలాంచల

జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా



అందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో 

Wednesday, January 23, 2013

తెలుగులో పాలన


తెలుగులో పాలన : సీఎంవో అధికారులకు 
ముఖ్యమంత్రి ఆదేశం
వ్యవహారాలను సాధ్యమైనంత వరకు తెలుగు భాషలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ కార్యాలయం నుంచి వివిధ శాఖలకు వెళ్లే అన్ని 'నోట్'లను 





సాధ్యమైనంత వరకు తెలుగులోనే తయారుచేసి పంపాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా వారం రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు కార్యాలయం అధికారులు తెలిపారు.

ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేయడం అధికారుల వంతు. 

Tuesday, January 22, 2013

మీకు తెలుసా !! ప్రపంచంలో రెండవ ఉత్తమ లిపి - తెలుగు లిపి



 అంతర్జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ లిపిగా ఎంపికైన 
మన తెలుగు లిపి: 


వివరాలకు ఈ క్రింది లింకు చూడండి. 

బ్లాగు: తెలుగు వెలుగు 

http://tkvgp.blogspot.in/2013/01/blog-post_4072.html


Thursday, January 17, 2013

ఒక తండ్రి గా మన ఘంటసాల

ఒక తండ్రి గా మన ఘంటసాల
తెలుగు జాతి గర్వించ దాగిన మహా గాయకుడు ఘంటసాల గురించి కొన్ని తెలిసిన , కొన్ని తెలియని విషయాలు ఆయన కుమార్తె ద్వారా తెలుసుకునే అవకాశం ఈ విధంగా కలిగించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక వారికి ధన్యవాదాలు. 


published in Andhrajyothi daily on 05.11.2012

Saturday, January 12, 2013




చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!!!  (thanks to Navya Weekly)