Wednesday, February 20, 2013

సజీవంగా తెలుగు

నేడు ప్రపంచ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 

ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ది కి మన వంతు కృషి చేద్దాం 

వీలైనంత వరకు తెలుగు లో మాట్లాడడానికి, వ్రాయడానికి ప్రయత్నిద్దాం.

మన భాషను సజీవంగా నిలుపుకుందాం.  

Sunday, February 10, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె, గుమ్మంలో దొంగలు


ఇప్పటివరకు ఇది సినిమా పాట అనుకున్నాను. 
ఈ రోజే పెద్ద బాలశిక్ష తిరగేస్తుంటే, ఇదొక సంప్రదాయిక 
బాలల గేయమని తెలిసింది. 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

సిరిమల్లె చెట్టేమో విరగబూసింది 

చెట్టు కదలకుండా కొమ్మ వంచండి 

కొమ్మ విరగకుండా పూలు కోయండి 

కోసిన పూలన్నీ దండ గుచ్చండి 

దండ తీసుకెళ్ళి సీతమ్మ కియ్యండి 

దాచుకో సీతమ్మ రాముడంపేడు 

దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు 

దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా

దాచుకోకుంటేను దోచుకుంటారు

Thursday, February 7, 2013

అన్నమయ్యను మనకు పరిచయం చేసినదెవరు ?


అరవయ్యేళ్ళ కిందటి వరకు అన్నమయ్య గురించి  చాలామంది పండితులకు సైతం తెలియదు. చరిత్రపుటల్లో ఆయన పేరు చూడడమే తప్ప ఆయన సాహిత్య స్వరూపం గురించి,  సంగీతం గురించి తెలియదు. మరి ఇప్పుడు ఆంధ్రదేశంలోనే కాదు దేశమంతటా, ప్రపంచమంతటా ఆయన పాటలు మారుమ్రోగుతున్నాయి. ఇందుకు కారణం ఒక తెలుగు సాహితీ కృషీవలుడు... ఆయనే

శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి 

నన్నయ, అన్నమయ్య రచనలను పరిష్కరించి ప్రజల కందించిన మహానుభావుడి గురించి ఈ రోజు ఆంద్ర జ్యోతి "నవ్య" లో చదివారా? 

ఇందులో కొన్ని ముఖ్యమైన భాగాలు ఇక్కడ చదవండి. 

మొత్తం వ్యాసం చదవాలంటే ఈ లింకు నొక్కండి: 


1939లో మద్రాసునుంచి తిరుపతికి వచ్చి స్థిరపడిన తర్వాత శాస్త్రిగారి సాహిత్య కృషి కొత్త మలుపు తిరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం ఆవరణలోని ఒక నేల మాళిగలో నాలుగు శతాబ్దాలుగా దాగి ఉన్న తాళ్ళపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరే కులను గుర్తించి, బయటికి తీయించి 1948లో వాటిని దేవస్థానం చేత ప్రచురింపజేశారు. 

మొత్తం 29 సంపుటాలుగా వెలువడిన ఆ సాహిత్యంలో మొదటి ఐదు సంపుటాల ప్రచురణ ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించగా వాటిలో 11 వేల కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయి. 

రాగిరేకుల మీది సంకీర్తనలకు స్వరాలు లేవు. వాటికి రాగతాళాల పేర్లు మాత్రమే పేర్కొనబడినాయి.

రాగిరేకుల సంగతి ఇలా ఉండగా, తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద కొన్ని శతాబ్దాలుగా అజ్ఞాతంగా పడి ఉన్న రెండు పెద్ద రాతి బండలు 1949లో ప్రభాకరశాస్త్రిగారి దృష్టికి వచ్చాయి. వాటిపై కొన్ని స్వరసహిత సంకీర్తనలు చెక్కి ఉన్నాయి.

అవి క్రీ. శ. 1500 ప్రాంతం నాటి తాళ్ళపాక వాగ్గేయకారుల రచనలై ఉంటాయనీ, బహుశా అన్నమయ్యవే కావచ్చుననీ శాస్త్రిగారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు యావత్ప్రపంచంలోనే ప్రప్రథమంగా లభించిన స్వరసహిత వాగ్గేయ రచనల శిలాలేఖములని కూడా ఆయన భావించారు. త్వరలో వాటిని నిశితంగా పరిశీలించి, పరిష్కరించి ప్రకటించాలని ఆయన సంకల్పించారు. కాని, ఆ పని జరిగేలోపునే - 1950లో - ఆయన దివంగతులైనారు. 

సాధారణంగా బండలపై అక్షరాలు చెక్కేవారు ముందుగా వాటిని నునుపు చేస్తారు. కాని, ఈ సంకీర్తనలు చెక్కిన బండలు నునుపుగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. వాటి మీది అక్షరాలను గుర్తించడం కష్టం. దేవస్థానం వారు ఆ బండలకు ఫోటోలు తీయించడం, లిపి శాస్త్రజ్ఞులు వాటిని నిశితంగా పరిశీలించి అక్షరాలను కాగితాల మీదికి ఎక్కించడం, కనిపించకుండా పోయిన భాగాలను మరొక తరహా పండితులు పూరించడం, సంగీత విద్వాంసులు స్వరసాహిత్య సమన్వయాన్ని సాధించడం, వీరంతా చర్చలు జరిపి గ్రంథాన్ని ప్రచురించడం - ఈ దశలన్నీ 1999 నాటికి పూర్తయినాయి.

అయినా, 'ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము' అనే పేరుతో దేవస్థానం వెలువరించిన ఆ గ్రంథం ప్రతులు సంపాదక వర్గం వారికి, దేవస్థానం అధికారులలో కొందరికి లభించాయే గాని మార్కెట్లోకి రాలేదు.  అసలా పుస్తకాన్ని తాము ఎప్పడూ చూడలేదని దేవస్థానం వారి పుస్తక విక్రయశాలల వారే చెబుతున్నారు. ఏమైనాయి అవన్నీ?

పూర్తి వ్యాసం చదవాలంటే ఇక్కడికి వెళ్ళండి

Tuesday, February 5, 2013

ఎఫ్ ఐ ఆర్ కూడా తెలుగులో


ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు తప్పనిసరి 


ఈరోజు మరొక మంచి వార్త: 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ సమావేశం. 

ముఖ్య నిర్ణయాలు: 
హాజరు పట్టీ లో సంతకాలు ఇకనుంచి తెలుగులో.
ప్రభుత్వ విభాగాల్లో నిత్య వ్యవహారాలూ తెలుగు లోనే. 
ఇక నుంచి అన్ని దరఖాస్తులు తెలుగులో మాత్రమే.
ఎఫ్ ఐ ఆర్ లు కూడా తెలుగులో ఉండాలి. 
మే 14 - అధికార భాషా దినోత్సవం. 


పూర్తి వివరాలకు ఈరోజు ఈనాడు లింకు

Monday, February 4, 2013

ఏమి శిక్ష కావాలి? అని అడిగిన NTR




ఏమి శిక్ష కావాలో కోరుకోనవె ప్రేయసి ...కోరుకోనవే ప్రేయసి 



ఏమి శిక్ష కావాలో కోరుకొనవె ప్రేయసీ...అంటూ ఖంగుమనే ఘంటసాల గొంతుతో ఎన్టీయార్ పాడుతున్న ఈ పాట విజయా వారి "చంద్రహారం" సినిమా లోనిది. 

ఆ తియ్యని పాట (ఘంటసాల), చక్కని పదాల అల్లిక (పింగళి) , వెంటాడే సంగీతం (ఘంటసాల), ఆహ్లాదకరమైన విజయా బ్రాండ్ చాయాగ్రహణం (మార్కస్ బార్ట్ లే), ముచ్చటైన నటన (రామారావు, శ్రీ రంజని, సావిత్రి ) - ఇవన్నీ సమాకూరాకా ఇంకా బాగుండక ...వేరే దారుందా ? 

మురిపముగా ముచ్చటగా ముద్దు ముద్దుగా ... అంటూ తెలుగు భాషలోని మధురమైన పదాలు ఉపయోగించి పింగళి రచించిన ఈపాట వింటూ ఏమి శిక్ష వేసినా ఆనందంగా అనుభవించవచ్చు కదా!! 

ఎందుకో ఈ పాట చాలా మందికి,  ఘంటసాల అభిమానులకు కూడా తెలియదు. నా వంతు కృషి గా ఈ మధురమైన పాటకి ప్రచారం కలిగించాలని ఈ చిన్ని ప్రయత్నం.  విన్నకొద్దీ విన్నకొద్దీ వదలబుద్ధి కాదు... ఇది నా హామీ.

Sunday, February 3, 2013

డి జి పి తెలుగు నిర్ణయం : మన భాషకు మంచి రోజులొచ్చాయి !!


ఈ రోజు ఈనాడులో ఈ  వార్త చదివి ఎంతో ఆనందించాను. మన భాషకి మంచిరోజులు వచ్చాయి అని అనుమానంగా ఉంది. ముందుగా మన డి జి పి గారికి, మండలి గారికి ధన్యవాదాలు. ముఖ్య మంత్రి కూడా ఈ విషయంలో ఇదే పట్టు కొనసాగిస్తే ... ఉందిలే మంచి కాలం ముందు ముందునా....



ఈనాడు 03.02.2013